పడమటి విషాదరాగం
Published in Andhra Jyothi Sunday magazine Sept 28, 2025
“ఏమయ్యాడట నీ పుత్రరత్నం? పది గంటలవుతుంది ఇంటికి రాలేదు.” పురుషోత్తంరావు ఫ్రిజ్ తెరిచి, ఆ సాయంత్రానికి నాలుగో బీర్ బాటిల్ ఓపెన్ చేసుకుని, మూత డస్ట్‌బిన్‌లో విసిరేసాడు. కాబినెట్ ఓపెన్ చేసి, చిప్స్ పాకెట్ తీసుకుని, ఆ పాకెట్ మరో చేత్తో పట్టుకుని, దభీమని సోఫాలో కూలబడ్డాడు.
పురుషోత్తంరావు పేరుకు మాత్రమే పురుషోత్తముడు. అతనిలో అపురుష లక్షణాలు చాలా ఉన్నాయి. నాలుగు సీసాల తరువాత దుర్భాషలు ఆరంభమవుతాయి. అవి ఎలాగో చెవులు మూసుకుని భరించవచ్చు. ఆరుకి మించి బీర్ బాటిల్స్ పట్టించాడంటే హింసాకాండ మొదలవుతుంది. ఆ కారణం వల్లనే భార్య శ్యామల, అతను ఆరు సీసాలు మించి త్రాగకుండా జాగ్రత్త పడుతుంది.
“‘ఫ్రెండ్స్‌తో పార్టీకి వెళ్తున్నాను, ఆలస్యంగా వస్తానని చెప్పాడు. రేపు ప్రొద్దున్నే ఆఫీస్‌కి వెళ్ళాలి కదా మీరు పడుకోండి. బాలు కోసం నేను మేలుకొని ఉంటాను.” ఈయన వెళ్తాడో, లేదో అని కొంచెం భయ పడుతూ అన్నది.
ఏ కళనున్నాడో పురుషోత్తంరావు లేచాడు. అతను లేవగానే ఒళ్ళో ఉన్న చిప్స్ ప్యాకెట్ కింద పడింది. కింద పడిన చిప్స్‌ని తొక్కుకుంటూ, బీర్ బాటిల్ తీసుకుని, “వాడు వచ్చినప్పుడు నన్ను లేపక పోయావో!” సోఫా వెనుక నిల్చున్శ శ్యామల జుట్టు గట్టిగా లాగి, “ఈ రోజు వాడి అంతు చూస్తాను.” అంటూ బెడ్ రూమ్‌లోకి వెళ్ళి పోయాడు.
శ్యామల దీర్ఘంగా నిట్టూర్చి, చిప్స్ అన్నీ ఎత్తి చెత్తబుట్టలో వేసి, మంచినీళ్ల గ్లాస్ తెచ్చుకుని కూర్చుంది. బాలు ప్రవర్తన చూస్తుంటే వీడు కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచేలా ఉన్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినప్పట్నుండీ వారానికి మూడు రోజులు, పార్టీలనీ, ఫ్రెండ్స్ అనీ ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. ఒకటి రెండు సార్లు ఆల్కహాల్ వాసన కూడా వచ్చింది. తను అడిగితే ఏవేవో సాకులు చెప్పాడు. పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు, కాని ఆల్కహాల్‌కి అలవాటు పడ్దాడు.
బాలు చేసే చిన్నచిన్న తప్పులు పురుషోత్తం వరకూ రానివ్వకుండా శ్యామల మందలిస్తుండేది. ఇప్పుడు వీడు చేయిజారి పోతున్నట్లనిపిస్తుంది. పురుషోత్తం దృష్టికి రాగానే బెల్ట్ తీస్తాడు. తండ్రిగా తన బాధ్యత అంతవరకే అనుకుంటాడు. చిన్నతనంలో బాలు భయపడేవాడు. ఇప్పుడు వాడికి ఆ భయం స్థానంలో జుగుప్స, నిర్లక్ష్యం పేరుకు పోతున్నాయి. తను చిన్నగా మందలించి, ప్రేమగా అన్నం పెట్ట గలదే కాని, తండ్రిగా సలహాలనిస్తూ సరైన దోవ చూపలేదు.
“బాలు ఇంటికి రాలేదామ్మా?” కూతురు అను లేచివచ్చి, ప్రక్కనే కూర్చున్నది.
“లేదమ్మా ఈ రోజు నా అదృష్టం ఏమిటో ఈయన వెళ్ళి పడుకున్నాడు. వీడు ఎప్పుడొస్తాడో!” తను కప్పుకున్న బ్లాంకెట్ కూతురికి కూడా కప్పుతూ అన్నది.
ఏ అర్దరాత్రప్పుడో రెండు గంటలకు ఫోన్ మోగింది. ఉలిక్కిపడి లేచి, తన భుజం మీద తలపెట్టి నిద్ర పోతున్న అనూని నెమ్మదిగా ప్రక్కకు జరిపి ఫోన్ తీసింది.
“ఈజ్ దిస్ మిసెస్ పురుషోత్తం?”
“ఎస్, హూ ఈజ్ దిస్ ప్లీజ్?” అదిరే గుండెల్ని చిక్కబట్టుకుంటూ అడిగింది.
“మేమ్ దిస్ ఈజ్ పీటర్, విలియంసన్ కౌంటీ ఆఫీసర్. వుయ్ హ్యావ్ యువర్ సన్ ఇన్ ది స్టేషన్ ఫర్ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లూఎన్స్,” అతని కంఠం గరగరమని వినిపించింది. వెనక ఎవరో దగ్గుతున్నారు.
“థ్యాంక్యూ ఆఫీసర్. వుయ్ విల్ బి దేర్ సూన్,” అన్నది. ఫోన్ పట్టుకున్న శ్యామల చేతులు తన కంట్రోల్లో లేకుండా వణుకు తున్నాయి.
పురుషోత్తంని నిద్రలేపి చెప్పాలి. పోలీస్ స్టేషన్‌లో బాలు ఉన్నాడు అనే వార్తకన్నా, ఈయన్ని నిద్రలేపి చెప్పటం చాలా భయంకరమైనది.
సహజంగా నాలుగైదుసార్లు నిద్ర లేపితేనే కాని లేవని పురుషోత్తం, “ఏమైంది ఫోన్ ఎక్కడ్నుంచి?” అంటూ లేచి వచ్చాడు.
“విలియంసన్ కౌంటీ పోలీస్ స్టేషన్ నుండి,” సణుగుతూ చెప్పింది.
“సణక్కుండా చెప్పు,” అరిచాడు.
“బాలు పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడట. ఆఫీసర్ ఫోన్ చేశాడు.”
“ఉండనీ, నాకేం సంబంధం లేదు.” పురుషోత్తం తిరిగి బెడ్‌రూమ్‌లోకి వెళ్తూ అన్నాడు.
“ఎవరికట సంబంధం? మీకు లేకపోయినా నాకు ఉంటుందిగా!” అంటూ చెప్పులు వేసుకుని కారు తాళాలు తీసుకుని బయలుదేరింది.
శ్యామల వెనుకే వచ్చి, కారు స్టార్ట్ చేస్తున్న ఆమె చేయి నెట్టేసి కారు కీస్ లాక్కుని లోపలికి వెళ్ళి పోయాడు.
ఇప్పుడెలా? ఇంత రాత్రివేళ టాక్సీలో ఒక్కదానినే వెళ్ళటం ప్రమాదం. ఏం చేయాలో పాలుపోవటం లేదు అనుకుంటూ, శ్యామల కారు దిగి రాబోతుండగా, నలిగి పోయిన బట్టలు వేసుకుని, రేగిన జుట్టుతో వచ్చాడు పురుషోత్తం.
శ్యామల నెమ్మదిగా కారు దిగి పాసింజర్ సీట్లో కూర్చున్నది.
పోలీస్ స్టేషన్లో గోడ వారగా కూర్చుని, ఒకరి భుజాలపై మరొకరు తలలు ఆనించి, మత్తుగా నలుగురు టీనేజర్స్ మన లోకంలో లేనట్లు తూలిపోతూ ఉన్నారు. వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వాళ్ళకు తెలియటం లేదు. వాళ్ళను చూడగానే శ్యామలకు కళ్ళు తిరిగినై. గోడ ఆసరాగా చేసుకుని నాలుగడుగులు వేసి, ఆఫీసర్ చూపిన కుర్చీలో కూర్చుని కొడుకు కేసి చూసింది.
ఈ పరిస్థితిలో వీళ్ళు కార్ డ్రైవ్ చేశారా! అదృష్టం బాగుండి ఎవరికీ ఏమీ జరక్కుండా బయట పడ్డారు. ఎంత ప్రమాదం! తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది.
“హైవే మీద వంకర టింకరగా పోతున్న కారుని చూసి, అనుమానం వచ్చి ఆపవలసి వచ్చింది” ఆఫీసర్ అన్నాడు.
“ఈ నలుగురిలో ఇద్దరికి పదహారు సంవత్సరాలు. వాళ్ళకు ఐదువందల డాలర్లు జరీమానా విధించి, ఆరునెలలు లైసెన్స్ కాన్సిల్ చేస్తారు. డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లూయన్స్ క్లాస్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఆరు నెలలు కమ్యూనిటీ సేవ చేయాలి. ఈ ఆరు నెలలు, ప్రొబేషన్ (పరిశీలన) లో ఉంటారు.
పదిహేడు సంవత్సరాలు నిండిన బాలు, అతని స్నేహితుడు గ్రెగ్‌లకు, రెండువేల డాలర్లు జరిమానా విధించి, దాదాపు 30-180 రోజులు జైలు శిక్ష వేస్తారు. ఇదే కాక ఒక సంవత్సరం వరకూ లైసెన్స్ కాన్సిల్ చేస్తారు. బాలు రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ .08 కన్నా ఎక్కువగా ఉండటం వల్ల అతనికి శిక్షాకాలం ఎక్కువ ఉంటుంది.” ఆఫీసర్, తలిదండ్రులకు వివరిస్తున్నాడు.
పురుషోత్తం ఒక్కసారిగా కుర్చీలోనుంచి లేచివెళ్ళి, బాలు చొక్కా పట్టుకుని ఊపేశాడు.
ఆఫీసర్ అతని దగ్గరకువెళ్ళి, “సర్, మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు,” అని హెచ్చరించాడు.
“నేను ఆ రెండువేల డాలర్లు కట్టను. వాడిని మీరేం చేసుకుంటారో చేసుకోండి,” అని దూకుడుగా వెళ్ళిపోతున్న పురుషోత్తంని, “మీరు చట్టాన్ని ధిక్కరిస్తారా” ఆఫీసర్ కోపంగా అడిగాడు.
మిగిలిన వారంతా పురుషోత్తంని వింతగా చూడసాగారు. శ్యామలకు భూమి పగిలి అందులో తను కూరుకుపోతే బాగుంటుందనిపించింది.
కళ్ళు క్రిందకు వాలిపోయి, నుదుటి మీద చిందర వందరగా జుట్టుపడి, కాళ్ళు, బార్లాచాపుకుని, చేతులు క్రిందకు వేళ్ళాడవేసుకుని, బాలు ఈ ప్రపంచంలో లేనట్లున్నాడు.
ఎలాంటివాడు ఎలా ఐపోయాడు! తప్పు చేస్తే చేశానని నిర్భయంగా ఒప్పుకుని తన్నులు తినేవాడు. అబద్ధం వాడి నోటివెంట వచ్చేది కాదు. క్రిస్‌మస్‌కి పైన్‌ట్రీని కట్ చేస్తారనీ, ఒక చెట్టు ప్రాణం తీసేస్తున్నామని వాదించేవాడు. చిన్న కుండీలో రెండు మొక్కలు – ఒకటి తనకోసం, మరొకటి చెల్లెలి కోసం తీసుకువచ్చి, వాటినే అలంకరించి పెట్టాడు. హోమ్‌లెస్ వారు కనుపించగానే తన జేబులో ఎంత ఉన్నదో చూసుకోకుండా ఇచ్చేసే వాడు. అంత జాలి గుండె ఏమై పోయిందో!
బాలు వయసు పెరిగే కొద్దీ, తండ్రి ప్రవర్తన వాడిని బాధిస్తోందని శ్యామల గ్రహించింది. కాని తనని తనే పతనం చేసుకునే వరకూ పోయిందని అనుకోలేదు.
పురుషోత్తం ముందు ధైర్యంగా నిలబడి అతని ప్రవర్తనను ఎత్తి చూపగల గుండె దిటవు కలది అనూ ఒక్కతే. తండ్రి నోరెత్తకముందే గజగజా వణికి పోయి, దాక్కునే వాడు బాలు. ఆడపిల్లలు అలాగే ధైర్యంగా ఉండాలని అనూని చూసి గర్వ పడాలా? వీడేమిటి ఇంత పిరికివాడని బాధ పడాలా?
బాలు ఐదేళ్ళ వయసునుండి గాడ్జిల్లా బొమ్మలు ఎంతో ఇష్టంగా దాచుకునే వాడు. తన దగ్గర ఉన్న నాలుగైదు ప్లాస్టిక్ గాడ్జిల్లా బొమ్మలకు పేర్లు పెట్టేవాడు. అవి, ఒకదానితో మరొకటి పోట్లాడుకుంటున్నట్టూ, ఒకదాని వెంట మరొకటి పరుగులు పెడుతున్నట్లూ గంటల తరబడి ఆడుకునేవాడు.
ఏడవ తరగతి పరీక్షలు అయిపోయిన తరువాత స్నేహితులంతా కలిసి గాడ్జిల్లా మూవీకి వెళ్తున్నారనీ తనూ వెళ్తానని శ్యామలను అడగటం విన్నాడు పురుషోత్తం. “మూవీకి వెళ్ళటానికి వీల్లేదు, వెళ్తే వీపు చీరేస్తా,”అని కేకలు వేశాడు.
తండ్రి నోరెత్తగానే వణికిపోయే బాలు, ఆ గాడ్జిల్లా మూవీ చూడాలనే కోరికను అణచుకోలేకనో ఏమో! “మూవీకి ఎందుకు వెళ్ళనీయవు?” అని తండ్రిని నిలదీశాడు.
“నీకు లెక్కల్లో ఎన్ని మార్కులొచ్చినయ్ వెధవా?” ఱంకె వేసాడు.
“సెవెంటీ ఫైవ్.” బాలు సిగ్గుపడుతూ నెమ్మదిగా చెప్పాడు.
“వెధవా! సి గ్రేడ్! సిగ్గులేదూ మూవీకి వెళ్తాననటానికి?”
“అన్న ఇంగ్లీష్‌లో, సైన్స్‌లో ఎప్పుడూ ఫస్ట్ వస్తాడుగా! అవి అడగవేం. అందరికీ అన్ని సబ్జక్ట్స్ రావాలని వుందా?” అనూ ఎప్పటిలా ధైర్యంగా అడిగింది.
“నువ్వు నోర్ముయ్!” అని అనూని ఒక కేకవేసి, “పిల్లల్ని నామీదకు ఉసి గొలుపుతావా?” అని శ్యామలను కొట్టాడు.
“మూవీకి వెళ్తానని అడిగింది నేను. అమ్మను కొడతా వెందుకు?” బాలు తండ్రిని నెట్టేసాడు.
అనుకోని బాలు చర్యకి శ్యామలతోపాటు పురుషోత్తం కూడా ఆశ్చర్య పోయి, బీర్‌సీసా తీసుకుని గదిలోకి వెళ్ళి పోయాడు.
ఆ రోజు మూవీ ప్రోగ్రామ్ కాన్సిల్ ఐపోయింది. అప్పట్నుంచి బాలు దేనినీ లెక్క చేయనట్లు ఉండటం మొదలు పెట్టాడు. ఆ సంఘటనతో తండ్రీ కొడుకుల మధ్య దూరం పెరిగి పోయింది. పురుషోత్తం ఇంట్లో ఉన్న సమయంలో బాలు బయట స్నేహితులతో ఎక్కువ కాలం గడిపేవాడు.
కోర్ట్‌లో న్యాయమూర్తి బాలుకి ఆరు నెలలు జైలు శిక్ష, రెండువేల డాలర్లు జరీమానాతో పాటు డ్రైవర్స్ లైసెన్స్ సంవత్సరం కాన్సిల్ చేశారు. బాలుని కోర్ట్‌లో ప్రవేశ పెట్టినప్పుడు ఏ భావమూ లేకుండా ఎలా ఉన్నాడో, తనకు విధించిన శిక్ష విని కూడా అలాగే ఉన్నాడు. ఆఫీసర్ వెంట తలొంచుకుని, వెళ్ళిపోయాడు.
చేతులకు, కాళ్ళకు వేసిన బేడీలతో ఉన్న కొడుకుని చూడగానే శ్యామల గుండె పగిలిపోయింది.
పురుషోత్తం పరుగులాటి నడకతో వెళ్ళి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
ఇంటివరండాలో కూర్చున్న పురుషోత్తం, టాక్సీలో వచ్చిన భార్యను, కూతురిని చూసి కూడా మౌనంగా ఉండిపోయాడు.
శ్యామల లోపలికి వెళ్ళి, ఫ్రిజ్ తెరిచి అందులో ఉన్న బీర్‌సీసాలన్నీ తీసుకుని, వరండాలోకి వచ్చి, వరండా మెట్లుదిగి, ఇంటి పక్క గోడవారగా పెట్టిన చెత్త డబ్బాలో, పురుషోత్తం చూస్తుండగా వేసేసి, చెత్త డబ్బామూత గట్టిగా వేసేసింది.
అది చూసి, గబగబా లేచి వచ్చి, “ఏం చేస్తున్నావే నువ్వు?” శ్యామలపైకి చేయెత్తాడు.
శ్యామల అతని చేతిని గట్టిగా పట్టుకుని, “కొడితే పడివుండే రోజులు పోయాయ్! ఇలా బెదిరించే, వాడిని ఈ పరిస్థితికి తీసుకు వచ్చారు. తండ్రిగా ప్రేమతో ఒక్క రోజైనా వాడిని దగ్గరకు తీసారా? ఆప్యాయంగా నాలుగు మాటలు మాట్లాడారా? చిన్నతనంలో భయపడి ఎదురు చెప్పలేక పోయినా వయసు పెరిగే కొద్దీ వాడిలో రగిలి పోతున్న కోపం అణుచుకోలేక ఇలా రెబెలియన్‌గా తయారై మనమీద కక్ష తీర్చుకున్నాడు. చేతులు కాలిపోయిన తరువాత, ఇప్పుడు ఆకులు పట్టుకున్నా లాభం లేదు” అని కళ్ళు తుడుచుకుంటూ, లోపలకెళ్ళి పోయింది.
పురుషోత్తం తెల్లవార్లూ వరండాలో కుర్చీలో తన జీవితం నెమరువేసుకుంటూ, కదలకుండా కూర్చున్నాడు.
బ్రాంచ్ మేనేజర్ పదవిలో ఉన్న పురుషోత్తం, తన సిబ్బందికి ముఖం చూపించలేక మూడు నెలలు సెలవు పెట్టి, చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మూడు నెలల్లో ఈ సమస్య పరిష్కారమై పోతుందా? మచ్చ తొలిగి పోతుందా? బాధగా అనుకున్నది శ్యామల.
శ్యామల ఎప్పటిలా, ఆఫీస్‌లో ఎదురు పడిన వారిని చిరునవ్వుతో పలకరిస్తూ తన క్యూబికల్‌కి వెళ్ళి పోయింది. బాలు ఆలోచనల నుండి తప్పించుకోవటానికి మనసంతా పనిపై నిలిపింది.
లంచ్‌టైమ్‌లో తన టేబుల్ దగ్గర కూర్చున్న తన తోటి ఉద్యోగులకు బాలు విషయం చెప్పి కొంత బాధ తగ్గించుకో గలిగింది.
డార్లీన్ లేచి వచ్చి, శ్యామలను ఆలింగనం చేసుకుని, అన్నది. “మన కుటుంబాలలో ఎక్కువగా టీనేజర్స్ ఇలా ప్రవర్తించిన వారే! ఇప్పటికి కూడా ఈ సమస్యలను ఎదుర్కుంటూనే ఉన్నాం. కానీ శ్యామల దురదృష్టం ఏమిటంటే బాలు పట్టు పడటం. భగవంతుడి దయవల్ల వాళ్ళకు ఏమీ ప్రమాదం జరగ లేదు. దిస్ కుడ్ హావ్ బీన్ బాడ్, రియల్లీ బాడ్.”
గ్రూప్‌లో వారంతా శ్యామలకు ధైర్యం చెప్తూ, తమ సహాయం ఏమి కావాలన్నా నిర్మొహమాటంగా అడగమని చెప్పారు.
తన భర్త దగ్గర దొరకని ఆదరణా, ఆప్యాయతా, తన కొలీగ్స్ ద్వారా లభించటంతో ఆమెకు దుఃఖం పొర్లుకు వచ్చేసింది.
బాలు విషయం సహోద్యోగులతో ఏ సంకోచం లేకుండా పంచుకో గలిగింది కాని, మాట మాత్రమైనా తనకు కాని, అనూకి కాని చెప్పకుండా వెళ్ళి పోయిన పురుషోత్తం గురించి మాట్లాడలేక పోయింది.
చలాకీగా ఇంట్లో అందర్నీ కవ్విస్తూ, కబుర్లు చెప్పే అనూ, టి.వి. ముందు ఏం చూస్తున్నదో కూడా తెలియకుండా, దిగులుగా కూర్చునుంది. అనూని ఆ స్తితిలో చూసిన శ్యామలకు కళ్ళు చెమర్చాయి.
అనూ ప్రక్కనే కూర్చుని, ఆమె తలను తన భుజం మీద ఆన్చుకుంది.
“నాన్న ఎక్కడికెళ్ళాడమ్మా?” అనూ అడిగింది.
శ్యామల చాలా సేపు ఏం మాట్లాడలేదు. అనూ తల నిముర్తూ, “ఈ రోజు మా ఆఫీస్‌లో ఏం జరిగిందో తెలుసా?” అని, డార్లీన్ అన్న మాటలు చెప్పింది.
“అన్న చాలా తప్పు చేసాడు. తన ప్రాణంతో పాటు మిగిలిన ముగ్గురి ప్రాణాలకూ ప్రమాదమే కదమ్మా!” అనూ వెక్కిళ్ళ మధ్య అన్నది.
అనూ వయసులో చిన్నదైనా ఎంతో బాధ్యతగా ప్రవర్తిస్తుంది. అమాయకంగా మాట్లాడే బాలు మాటలు, ఎంతో పెద్దదానిలా మాట్లాడే అను మాటలు విన్నప్పుడు, వీళ్ళిద్దరినీ నేనే కదా కన్నాను, నేనే కదా పెంచాను. ఈ వ్యత్యాసం ఏమిటి? ఎక్కడ నుండి వస్తాయి పిల్లల ప్రవర్తనలో ఈ భేదాలు? అని శ్యామల అప్పుడప్పుడూ ఆశ్చర్యపడుతూ ఉండేది.
పురుషోత్తం ఎక్కడికెళ్ళాడో తెలియదు. ఇలాంటి సమయాల్లో కుటుంబంలో ఒకరికి మరొకరి తోడు అవసరం. ఒకరి బాధ మరొకరు పంచుకోవటం అవసరం. ఇంటి పెద్దగా తను ధైర్యం చెప్పవలసింది పోయి, బాధ్యత లేకుండా వెళ్ళి పోయాడు.
మరునాడు ఆఫీస్‌కి సెలవు పెట్టి, బాలు స్కూల్‌కి వెళ్ళి ప్రిన్సిపాల్‌తో జరిగిన విషయం చెప్పింది. శ్యామల చెప్పినది శ్రధ్ధగా విని, ఆమె పడుతున్న ఆవేదనను అర్ధం చేసుకున్నాడు. తనకూ ఒక టీనేజ్ కూతురు ఉన్నదనీ, ఆ పిల్ల దుడుకు తనం వల్ల ఎప్పుడు ఏమి వినవలసి వస్తుందోనని భయపడ్తూ ఉంటానని చెప్పాడు. బాలుకి మూడు నెలల సిలబస్ నోట్స్ ఇచ్చి, తనే స్వయంగా శ్యామలను బాలు లాకర్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు. లాకర్‌లో బుక్స్ తీసుకుంటున్న మరొక స్టూడెంట్ సహాయం తీసుకుని, టెక్ట్‌బుక్స్, నోట్స్ అన్నీ బాగ్‌లో పెట్టించి, కారు వరకు తీసుకువచ్చాడు. ప్రిన్సిపాల్ ఆదరణకు శ్యామల చెమర్చిన కళ్ళతో ఆయనకు వీడ్కోలు చెప్పింది.
జైల్‌కి వెళ్ళి, తను తీసుకువచ్చిన ఆ బాగ్‌లో ఏమేమి వస్తువులున్నాయో ఆఫీసర్‌కి చూపించింది. ఆతను చెప్పినట్లు లిస్ట్ వ్రాసి ఇచ్చి, బాగ్ బాలుకి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేసింది. ఒంటరిగా ఇంటికి వచ్చి, సోఫాలో కూర్చుని రెండు చేతుల్లో ముఖం దాచుకుని భోరున ఏడవటం మొదలు పెట్టింది.
గుండెలో బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చిన తరువాత కొంత ఉపశమనం పొందింది. అప్పటికి తన ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. కలం, కాగితం తీసుకుని బాలుకి ఉత్తరం వ్రాయటం మొదలు పెట్టింది.
‘హాయ్ నాన్నా,
బాలూ, నువ్వు బంగారు తండ్రివి నాన్నా. ఎంతో తెలివైన వాడివి, జాలిగుండె కలవాడివి.
దారి తప్పి తప్పటడుగులు వేసిన ఎందరో, ఆ అడుగులలో పడిన తమ తప్పులను తెలుసుకుని, వారి జీవితాలను సరిదిద్దుకుంటారు. దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్. నీకు భావి జీవితం ఎంతో ఉన్నది. మానసికంగా కృంగిపోయినప్పుడు మనసుని దిటవు చేసుకుని నిలదొక్కుకోవటానికి నీ విజ్ఞతని వినియోగించుకోవాలి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉన్నది. నేను కాని, మీ నాన్న కాని, చేయగలిగింది నీకు చేయూత ఇవ్వటం వరకే.
మంచికో చెడుకో మన జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అన్నీ మన మంచికే అనుకునే కన్నా, జరిగిన సంఘటనలను ఛాలంజ్‌గా తీసుకుని నడుచు కోవటం తెలివైన వారి లక్షణం. కొన్ని కొన్ని సంఘటనలు మనల్ని ఎంతో బలవంతులను చేస్తాయి. మరి కొన్ని కృంగతీస్తాయి. కృంగిపోయిన మనసుని దిటవు చేసుకుని నిలదొక్కుకోవటంలోనే నీ చాకచక్యం వినియోగించు కోవాలి.
ఈ రోజు నీ ప్రిన్సిపాల్‌ని కలుసుకున్నాను. ఆయన నిన్ను ఎంతో మెచ్చుకున్నారు. ‘హి ఈజ్ ఒన్ ఆఫ్ మై ఫేవరైట్ స్టూడెంట్స్‘ అని చెప్పినప్పుడు నా ఛాతీ గర్వంతో పొంగి పోయింది బాబూ! ఆయనే నీ లాకర్ తెరిచి నీ బుక్స్ అన్నీ నా చేతికిచ్చారు.
నీ మంచి కోరేవారూ, నువ్వు లైఫ్‌లో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకునే వారూ ఎందరో ఉన్నారు తండ్రీ! అందరినీ నువ్వు నిండు మనసుతో చేరుకుని వారు అందించిన చేయూతని అందుకో గలగాలి. ఇవన్నీ నీకు తెలియని విషయాలు ఏమీ కావు. కాని ఒక్కొక్కసారి మనలను ప్రేమించేవారి నోటి నుండి ఇలాటి మాటలు వెలువడినప్పుడు రివైవ్ అవుతున్నట్లు ఉంటుంది.
అనూ నిన్ను మిస్ అవుతుంది. అది కూడా నీకు లెటర్ వ్రాస్తానన్నది.
ధైర్యంగా ఉండు నాన్నా!
ప్రతి శుక్రవారం సాయంత్రం నీ దగ్గరకు వస్తాను. నీ కేమైనా కావాలంటే వెంటనే తెలియజేయి.
ప్రేమతో, అమ్మ
అనూ ఇంకా ఇంటికి రాలేదు. టీనీళ్ళు పెడదామని స్టవ్ వెలిగించగానే తను ఉదయం నుండి ఏమీ తినలేదని గుర్తు వచ్చింది కాని, ఆకలి లేదు, తినాలనిపించలేదు. ‘డిప్రెషన్ నాట్ ఓన్లీ కెన్ కిల్ హంగర్, ఇట్ కెన్ ఆల్సో కిల్ పీపుల్’. డార్లీన్ తనని ధైర్యంగా ఉండమని చెప్తూ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. బిస్కెట్స్ నాలుగు ప్లేట్‌లో పెట్టుకుని, టీ కెటిల్‌లో టీ పోసి, రెండు కప్పులు టేబుల్‌పై పెట్టి అనూ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నది.
“అమ్మా, నువ్వు ఈ రోజు మా స్కూల్‌కి వచ్చావా?” అనూ స్కూల్ బాగ్ భుజాలమీది నుండి తీస్తూ అడిగింది.
“అవును ఏం?”
“ఏం లేదు. పింకీ నిన్ను చూసిందట నువ్వు ఎందుకు వచ్చావని అడిగింది. అన్న బుక్స్ కోసం వచ్చావా?”
టీ కప్‌లో పోస్తుండగా ఫోన్ మ్రోగింది. మౌత్‌పీస్ చేత్తో కవర్ చేసి, “ఆంటీ, పింకీ వాళ్ళ అమ్మ,” అనూ అన్నది.
“హలో” అంది శ్యామల అప్పుడే వార్త చేరిపోయిందా! అనుకుంటూ.
“నేను విన్నది నిజమేనా?” అవతలనుండి ప్రగతి గొంతు పెద్దగా వినిపించింది.
శ్యామల కొంచెం సేపు ఏం మాట్లాడలేదు. “ఏం విన్నావ్?” అడిగింది.
“అదే! బాలూ గురించి. ఎంతమంది అరెస్ట్ అయ్యారు ?”
“నలుగురు,” అని వాళ్ళ పేర్లు చెప్పింది శ్యామల.
“ఇక్కడి వాళ్ళకు ఇవన్నీ మామూలే. మన పిల్లలు ఇలా చిక్కుకు పోవటం చాలా బాధ అనిపిస్తుంది.
ఐ యామ్ రియల్లీ సారీ! పురుషోత్తం కూడా ఆఫీస్ కి రాలేదని చెప్పాడు వసంత్. వసంత్, పురుషోత్తం కొలీగ్స్..
శ్యామల ఏం మాట్లడలేదు. “ఉంటా,” అని ప్రగతితో చెప్పి ఫోన్ పెట్టేసింది. ‘ఇక్కడి వాళ్ళకు ఇవన్నీ మామూలే’ అన్న ప్రగతి మాటలు ఆమెకు విషం చిమ్మినట్లుగా అనిపించింది. ఎంత సంకుచిత మనస్తత్వం!
మొదటి సారి బాలు దగ్గరకు వెళ్ళినప్పుడు తనను చూస్తూనే, “నన్ను క్షమించమ్మా,” పదేపదే అంటూ ఏడ్చేసాడు. ఆ రోజు బాలు ఏం మాట్లాడలేదు.
ఆతరువాత రోజు, శ్యామల బయలుదేరే ముందు, “నీ లెటర్ అందింది.” తల ఒంచుకుని అన్నాడు.
బాలుని చూస్తుంటే జైల్లో కొంత మామూలు స్తితికి వస్తున్నాడనిపించింది. ఈ రెండు నెలల కాలంలో అతనిలో చాలా మార్పు వచ్చింది. ఎంతో ఎదిగినట్లు కనిపించాడు. స్కూల్ సిలబస్ ప్రకారం హోంవర్క్ పూర్తిచేసి శ్యామల చేతికిస్తున్నాడు.
“నాన్న రానన్నాడా?” తండ్రి గురించి మొదటిసారి అడిగాడు.
శ్యామలకు చెప్పక తప్పలేదు.
“పారిపోయాడన్నమాట.” కొద్దిసేపు మౌనం తరువాత అడిగాడు, “అనూ, నువ్వూ యాల్-యానన్ మీటింగ్స్‌కి (ఫ్యామిలోలో ఎవరైనా డ్రగ్స్‌కి,, ఆల్కహాల్‌కి, విపరీతంగా అలవాటు పడి బాధ పడుతున్నప్పుడు ఆ ప్రభావం కుటుంబ సభ్యులందరిపైనా ఉంటుంది. యాల్-యానన్ మీటింగ్స్ లో అలా బాధ పడుతున్న కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఉంటుంది) వెళ్తున్నారా?”
వెళ్తున్నామన్నట్లు తల ఊపి, “అనూని ఇక్కడకు తీసుకు రమ్మంటావా?” అడిగింది.
“వద్దు. అనూని నేనిక్కడ కలుసుకోలేను.”
“నాన్న నీ మీద చెయ్యెత్తినప్పుడు ఏమీ చేయలేక పోయే వాడిని. ఆ క్షణంలో నాకు చచ్చిపోవాలని అనిపించేది.” బాధగా అన్నాడు.
తను ఏమీ చేయలేక పోయానని బాధ పడుతున్న బాలు ముఖం చూస్తున్న శ్యామలకు దుఃఖం ఆగలేదు.
పురుషోత్తం, లాస్ ఏంజిల్స్‌లోనే వేరే కంపెనీలో చేరాడని వసంత్ ఫోన్ చేసి చెప్పాడు. ఆ సాయంత్రం, శ్యామల పురుషోత్తంకి ఫోన్ చేసింది.
“తన కుటుంబంలో వాళ్ళెవరికీ తనంటే గౌరవం లేదనీ, గౌరవం లేని చోటకు తను రాలేననీ” అని నిక్కచ్చిగా చెప్పాడు.
తప్పంతా శ్యామల మీదకు తోసివేసి, జరిగిన దానికి ఆమే బాధ్యురాలన్నట్లు మాట్లాడుతున్న పురుషోత్తం మాటలు బాధ కలిగించాయి. కుటుంబం గురించిన బాధ అతనిలో ఏమాత్రమూ లేదనిపించింది. కనీసం పిల్లల గురించైనా అడగలేదు.
పురుషోత్తం తను పనిచేసే ఆఫీస్‌లోనే, షాలిని అనే యువతితో తిరుగుతున్నాడనీ, వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారనే రూమర్స్ శ్యామల వరకూ వచ్చేవి. అవి విని మొదట్లో బాధ అనిపించేది. ఆ తరువాత, పురుషోత్తం గురించిన వార్తలు వినటం అలవాటై పోయి, అంతలా బాధ పడేది కాదు.
తండ్రి వెళ్ళి పోవటానికి తనే కారణం అని బాలు తనలో తనే బాధపడుతున్నాడని గ్రహించి, సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది.
“నాన్న వెళ్ళిపోవటానికి కారణం అన్న అని నీకెప్పుడైనా అనిపిస్తుందా?” అనూని అడిగింది.
“లేదమ్మా! నాన్న, కుటుంబం పట్ల ఎప్పుడూ బాధ్యతగా ఉండేవాడు కాదు. చాలా స్వార్ధపరుడు. తన సుఖం తను చూసుకుని వెళ్ళి పోయాడు.” అనూ, అన్న మాటలు విని మౌనంగా ఉండిపోయింది శ్యామల.
రైలుప్రయాణం
“చేత వెన్నముద్ద, చెంగల్వపూదండ, బంగారు మొలత్రాడు, పట్టుదట్టి, సందెతాఎత్తులు, సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా నిన్ను చేరికొలుతూ!”
ప్రదీప్‌ని తాతయ్య ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాకు నేర్పిన మొట్ట మొదటి పద్యం వాడికి చెప్తున్నారు. వాడికి అసలే నోరు తిరగదు. అందులో అలవాటులేని తెలుగు. అతికష్టంగా తన యాసలో తను పలుకుతున్నాడు ప్రదీప్. స్కూల్ టీచర్‌గా రిటైర్ అయిన తాతయ్య, వాడి యాస భరించలేనట్లు ఎలాగైనా వాడితో యాస లేకుండా పలికించాలని ప్రయాస పడుతున్నారు. అది చూసి నవ్వుకుంటూ, అమ్మమ్మ నరసమ్మతో పంపించిన కాఫీ త్రాగుతూ కూర్చున్నాను.
ఇంకొక రెండు రోజుల్లో వీళ్ళిద్దరినీ వదిలి వెళ్ళిపోవలనుకుంటే బాధ వేస్తుంది. ఎంతో ఆప్యాయతా, అనురాగం చూపించే అమ్మమ్మనూ, తాతయ్యనూ చూడకుండా ఇన్ని సంవత్సరాలు ఎలావుండగలిగానో! ఈ పది సంవత్సరాలలో వీరిలో ఎంత మార్పు వచ్చిందో! రైలుదిగి నాలుగు మైళ్ళు సునాయాసంగా నడిచి రాగలిగేవారు తాతయ్య. అలాటిది ఇంటి ఆవరణలో నడవటానికి కూడా ఆయాస పడుతున్నారు. పాతిక మందికి ఒక్కచేతి మీదుగా వంట చేయగలిగిన మా అమ్మమ్మ, పార్వతమ్మ సాయం లేనిదే ఏమీ చేయలేక పోతున్నారు. “నేను వెళ్ళి ఎప్పుడు తిరిగి వస్తానో! నేను మళ్ళీ వీరిద్దరినీ చూడగలనా?” అనే ఆలోచనతో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
నేను అమెరికా తిరిగి వెళ్ళే వరకు వీరితో గడపాలనుకున్న నా పధకాన్ని, “నీకు, సుధకు, చాటల నోము తీర్చాలి. అమ్మమ్మను తాతయ్యను తీసుకుని వచ్చేయ్” అని అమ్మ కబురు పంపించింది. ఉసూరుమంటూ సరేననక తప్పలేదు. చకచకా మారిపోతున్న కాలంతో తమకు సంబంధం లేనట్లు నిరాడంబరంగా, నిర్మలంగా, ఈ పల్లెటూళ్ళో కాలం గడిపేస్తున్నఈ ముసలి దంపతులు నాకు తెలిసిన పార్వతీ పరమేశ్వరులు.
“ఇదిగో అత్తా, నీకు ప్రదీప్‌కి టికెట్ రిజర్వ్ చేయించాను.” అన్నకొడుకు, గౌతమ్ టికెట్ నా చే్తికిచ్చాడు.
నేను మొదటిసారి అమెరికా వెళ్ళేటప్పటికి వీడికి నాలుగేళ్ళు. “నేనూవస్తా నీతో తీసుకుని వెళ్ళు” అని గొడవ చేశాడు. నూనూగు మీసాలతో, మారుతున్న కంఠంతో, నేను విమానం దిగి బయటకు రాగానే, నాకోసం ఎదురు చూస్తున్న గౌతమ్‌ని గుర్తుపట్టలేక పోయాను. ఒక్క గౌతమ్ నే ఏమిటి అప్పట్లో తప్పటడుగులు వేస్తున్న ఆడపిల్లలు లంగా ఓణీలు వేస్తున్నారు. మగపిల్లలు ప్యాంట్ షర్ట్ లు వేసారు. వీరంతా, ఎదురు వచ్చి తామెవరో చెప్పేవరకూ ఎవరినీ గుర్తుపట్టలేక పోయాను.
అలాగే ప్రతి ఊరిలోనూ వీధులన్నీ గుర్తుపట్టలేనంతగా మారి పోయాయి. ఎన్నో దుకాణాలు, సినిమాహాల్స్, ఆకాశాన్నిఅంటే సౌధాలు విపరీతంగా పెరిగి పోయాయి. మన దేశ ప్రగతి మనం ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా ముందుకు సాగిపోతుందని అనిపించింది.
పల్లెటూళ్ళలో రైతులు, వ్యవసాయం కౌలుకి ఇచ్చేసికానీ, లేక, వున్న నాలుగెకరాల పొలం అమ్ముకుని కానీ పిల్లల చదువుల కోసమని పట్టణాలకు వలస వెళ్ళి పోయారు. చాలా వరకు ఆ ఇళ్ళన్నీ పాడుబడి పోయాయి.
“మన ఊరినుంచి కూడా అమెరికా వెళ్ళిన వారు కనీసం ఇంటికి ఒక్కరైనా ఉన్నారమ్మా” తాతయ్య, కొంత గర్వంగా, కొంత బాధగా అన్నారు.
అమ్మమ్మా, తాతయ్యల దగ్గర వీడ్కోలు తీసుకోవటం నేను అనుకున్నదానికన్నా చాలా కష్టమై పోయింది.
“మీరు వెళ్ళేది ఎస్‌ప్రెస్ రైలు, మన ఊళ్ళో రెండు నిముషాలకన్నా ఆగదు. మీరు త్వరగా ఎక్కేయాలి. ఈ రోజు నాకు సైన్స్ పరీక్ష ఉన్నది లేకపోతే నేనే వచ్చేవాడిని స్టేషన్‌కి .”నొచ్చుకుంటూ అన్నాడు గౌతమ్.
“మన ఊళ్ళో ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఆగుతుందా?” ఆశ్చర్యంగా అడిగాను. నేను అమెరికా వెళ్ళేముందు ఊళ్ళో రైలు స్టేషను కూడా లేదు.
“ఈ రైలు ఒక్కటే ఆగుతుంది. ఎక్కి కాసేపు కునుకు తీసేలోగా హైదరాబాద్ వెళ్ళి పోతావు. ఐదు గంటలంటే ఎంత సేపు! ఇట్టే వెళ్ళిపోతావు,” గర్వంగా చెప్పాడు గౌతమ్.
“చాటల నోముకి మీ అమ్మ పదిమందినీ పిలవాలికదా తల్లీ. అమ్మ ఒక్కతే చేసుకోలేదు” అని నాలుగు రకాల పిండివంటలు చేయించారు. అవి తాటాకు బుట్టల్లో పెట్టించి, ఆ నాలుగు బుట్టలు ఒక అట్టపెట్టెలో పెట్టి, ఆ పెట్టెకు తాళ్ళు కట్టించి, పకడ్బందీగా ప్యాక్ చేయించిన అట్టపెట్టె వైపు అనుమానంగా చూశాను. అది చూసి, “మన దుర్గారావు వస్తాడమ్మా స్టేషన్‌కి. నిన్ను సునాయాసంగా రైలు ఎక్కించ గలడు. వాడికి ఇది అలవాటే!” తాతయ్య భరోసా ఇచ్చారు. దుర్గారావు తాతయ్యకు కుడిభుజం వంటివాడు.
అమ్మమ్మ, తాతయ్యల పాదాలకు నమస్కరించి, “మీరుకూడా నాతో రాకూడదా! అమ్మ సంతోషిస్తుంది” అన్నాను.
“తాతయ్య రాలేరుతల్లీ. ఆయన్ని వదిలి నేనెలా రాగలను?” అన్నది అమ్మమ్మ
ఆఘమేఘాలమీద ఉత్సాహంగా పరుగులు పెడ్తున్న జట్కా బండిలో కూర్చుని ప్రదీప్ రాకెట్‌లో కూర్చున్నంత సంతోషపడి పోతున్నాడు.
నేను చేసిన హడావుడివల్ల స్టేషన్‌కి అరగంట ముందుగా వచ్చేశాము. స్టేషన్‌లో జనం ఎక్కువగా లేరు. ఎవరో ఇద్దరు ముగ్గురు మాలాగే సామాన్లు దించుకుని వాటి ప్రక్కనే నిల్చుని వున్నారు. వీరు కాక, దూరంగా ఉన్న రెండు సిమెంట్ బెంచీల మీద నలుగురైదుగురు కూర్చుని వున్నారు. మేము వెళ్ళిన పదినిముషాల లోపే ఏదో ఒక ప్యాసింజర్ రైలు వచ్చింది. దానితో స్టేషన్ ఖాళీ అయి పోయింది. ‘పోనీలే! మా రైలు ఎక్కవలసినవారు ఎవరూలేరు కాబట్టి మేము తేలిగ్గానే ఎక్కవచ్చు’ అనుకున్నాను.
“సిగ్నల్ ఇచ్చారమ్మా. బండి వచ్చేస్తుంది.” స్టేషన్ లో పచార్లు కొడుతున్న దుర్గారావు వచ్చేశాడు. అమెరికాలో రైలు ఎక్కే అవకాసం రాని ప్రదీప్, రైలు ప్రయాణం అనుకున్నప్పట్నుండి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాడు.
స్టేషన్ లో ఎక్కువమంది ప్రయాణీకులు లేరు, “మనం ఎక్కటానికి అంతగా హడావుడి పడనక్కరలేదులే” అన్నాను.
“ఈ బండి టేషన్ లో అట్టా ఆగుద్ది, ఆట్టా బయలెల్లి పోతది.” తలపాగా చుట్టుకుంటూ సూట్‌కేస్ నా చేతికిచ్చి, “మీరు ఇది పట్టుకోండమ్మా, నేను ఈ అట్టపెట్టె తలమీద పెట్టుకుంటా” అని స్టేషన్‌లో తిరుగుతున్న మనిషి సాయం అడిగి అట్టపెట్టె తలపైకి ఎత్తుకున్నాడు.
దూరంనుండి రైలు పెద్దగా కూతవేస్తూ రావటం చూసి, ప్రదీప్ చెవులు గట్టిగా మూసుకుని, హుషారుగా గంతులేశాడు. నేను వాడి చేయి ఒకచేత్తో, సూట్‌కేస్ మరోచేత్తో పట్టుకుని దుర్గారావు వెనుక నిల్చున్నాను. రైలు రావటం చూసి ఎక్కడ్నుంచి వచ్చారో! భూమాత కన్నదేమో అన్నట్లు బిలబిల్లాడుతూ తట్టలూ, బుట్టలూ తలలపై పెట్టుకుని, జనం నెట్టుకుంటూ వచ్చేశారు.
వాళ్ళందర్నీచూస్తూనే వీళ్ళందర్నీ నెట్టుకుని ఎక్కగలనా! అని నాకు ఆందోళన పెరిగి పోయింది.
రైలు ఆగగానే వాకిట్లో గుమిగూడి నెట్టుకుంటున్న జనాన్ని చూసి నా చేతిలో సూట్‌కేస్ కూడా తీసుకుని నన్ను, ప్రదీప్‌ని అతి ప్రయాసపడి రైలెక్కించాడు దుర్గారావు. ఆ ఒత్తిడిలో నెట్టుకుని వస్తున్న జనం నుండి మా ఇద్దరినీ తప్పించుకు పోవటం తప్ప, దుర్గారావుని గురించిగానీ, అతని దగ్గరున్న సామాను గురించిగానీ ఆలోచించ లేదు. ప్రదీప్ చేయిపట్టుకుని నడుస్తున్న నేను, రైలు బయలుదేరిన తరువాతగాని మేము ఎక్కిన బోగీ కిచెన్ బోగీ అని గ్రహించలేక పోయాను.
అంతవరకు నాకు మన రైళ్ళలో కిచెన్ బోగీ వుంటుందనే ఆలోచనే లేదు. ఘుమఘుమ లాడుతున్న వాసనలనుండీ, ఆ బోగీలో పనులు చేస్తున్నవారు మా వైపు వింతగా చూస్తున్న చూపులనుండీ తప్పించుకుని, ప్రదీప్ చేయి పట్టుకుని క్రిక్కిరిసివున్న ప్రక్క బోగీలోకి వచ్చిపడ్డాము. కాని అది రిజర్వేషన్ బోగీకాదు. జనరల్ బోగీ. మొదటి బోగీలాగానే క్రిక్కిరిసివున్న మరో రెండు బోగీలు దాటినా మా రిజర్వేషన్ బోగీని చేరుకోలేక పోయాము.
ఉస్సురంటూ ఎక్కడైనా జాగా వున్నదేమోనని చూసుకుని, ముగ్గురు కూర్చోవలసిన ఒక సీట్లో కొంచెం బొద్దుగా వున్న ఒకావిడా, ఆవిడ భర్త అనుకుంటా ఇద్దరూ విశాలంగా కూర్చోవటం చూసి నెమ్మదిగా వారి ప్రక్కన చేరాను. నేను తమవైపు రావటం చూసినావిడ ముందుచూపుగా కాళ్ళు రెండూ కె౧చెం వెడంగా పెట్టి సీట్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించేసుకున్నది. ప్రదీప్‌ని కూర్చోబెట్టి, సీటు చివర్లో పడిపోకుండా వుండటానికి కాళ్ళు గట్టిగా తన్నిపట్టి, ప్రదీప్ నడుంచుట్టూ చేయివేసి, వాడిని పట్టుకుని కూర్చున్నాను.
మాకు ఎదురుగా ఉన్న సీట్లలో కిటికీ ప్రక్కగా ఒక ముసలావిడా, ఆవిడ ప్రక్కన ఒక యువజంటా కూర్చున్నారు. ఆ అబ్బాయి, కాళ్ళు ముడుచుకుని ఆ అమ్మాయి ఒళ్ళో పడుకున్నాడు. ఆ అమ్మాయి ముంగులు సవరిస్తూ, తన చూపుడు వ్రేలితో ఆమె పెదవులపైనా, బుగ్గలపైనా వ్రాస్తూ, ఆపకుండా ఏవో కబుర్లు చెప్తున్నాడు. ఆ అమ్మాయి, ఆ అబ్బాయి జుట్టు సవరిస్తూ, అతను చెప్పేమాటలు శ్రద్దగా వింటూ, చిరునవ్వు నవ్వుతుంది. సింగిల్ సీట్లలో ఇద్దరు యువకులు వేరుశనగకాయలు తింటూ ప్రస్తుతం వున్న మన సినీహీరోల్లో మహేష్ గొప్ప నటుడా లేక వెంకటేష్ గొప్పనటుడా అని వాదించుకుంటున్నారు.
“మామ్, దే ఆర్ త్రోయింగ్ ట్రాష్ ఆన్ ది ఫ్లోర్ ” వేరుశనగకాయల పొట్టు కింద పడేస్తున్న వాళ్ళనుచూసి ప్రదీప్ నా చెవిలో చెప్పాడు.
“హుష్!” అన్నట్లు నా చూపుడువ్రేలు వాడి పెదవులపై పెట్టి చిరునవ్వునవ్వాను.
దుర్గారావు ఏమైపోయాడో! సామాన్లతో రైలు ఎక్కగలిగాడా? లేక స్టేషన్ లోనే దిగబడి పోయాడా? ఒకవేళ ఎక్కినట్లయితే అతనికి టికెట్ లేదు. అతను ఎక్కాడో లేదో కనుక్కోవటం ఎలా? నాకేం చేయాలో పాలుపోలేదు. అతను ఇంటికి తిరిగిరాలేదు. ఏమైందోనని అమ్మమ్మ, తాతయ్యలు గాబరాపడి పోతారు.
నా ఆలోచనల్లో నేను మునిగి ఉండగా, ఇద్దరు ఇజ్రాలు బోగీలోకి ప్రవేసించారు. చౌకబారు నైలాన్ చీరెలు కట్టుకని, ఒంటికి అతుక్కు పోయేలా బిగుతుగా కుట్టించుకున్న జాకెట్లూ తొడుక్కున్నారు. మెడలో రోల్జ్ గోల్డ్ గొలుసులూ, మోటుగావున్న చేతులకు ప్లాస్తిక్ గాజులు వేసుకుని, ముఖానికి తెల్లగా చౌకబారు పౌడర్ వేసుకుని, నుదుట పెద్ద చుక్కబొట్టు పెట్టుకున్నారు. మగవారిని “బావ, బావ” అని సంభోదిస్తూ, డబ్బులివ్వమని ఒత్తిడి చేసి, ఇవ్వనివారి జేబుల్లో చేతులు పెట్టి చేతికందినవి తీసేసుకుంటున్నారు. సింగిల్ సీట్లలో కూర్చున్న ఒకతని జేబులో చేయిపెట్టగానె అతను సిగ్గుపడి జేబులో నుండి చేతికొచ్చిన రూపాయలు వారికిచ్చేశాడు. కాని రెండవ అతను మాత్రం ఇవ్వనని భీష్మించుకోవటంతో ఇజ్రాలకు అతని దగ్గర బలవంతంగా లాక్కోక తప్పలేదు.
మా ప్రక్కన కూర్చున్నావిడ, భర్తను రక్షించే ఉద్దేశ్యంతో, “ఆయనకు ఒంట్లో కులాసాగా లేదు,” అని కబుర్లు చెప్తుంది. కాని వాళ్ళు మాత్రం ఆయన ముందుకొచ్చి, చేతులు చాపారు. “ఇవ్వకపోతే మీదపడి లాక్కుంటారే!” అని వాళ్ళావిడ చూస్తున్న చురచుర చూపులు పట్టించుకోకుండా ఆయన వాళ్ళచేతిలో పైకం పెట్టాడు. బోగీలో వారంతా వికారంగా ముఖాలు పెట్టి వాళ్ళని చీడపురుగుల్లా చూడ సాగారు. ఆ చూపులు తమకి అలవాటే అన్నట్లు వీరి చూపులను వాళ్ళు లెక్కచేయకుండా తమ పని తాము చేసుకుని వెళ్ళిపోతున్నారు.
వాళ్ళు కనుమరుగవ్వగానే బోగీలో వున్నవారి సంభాషణ ఇజ్రాలవైపు మళ్ళింది. ప్రజలను పీడించే వీళ్ళను చూస్తూ వూరుకోకూడదనీ, ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుని వీళ్ళను దేశం నుండి వెలివేయాలనీ ఇంకా ఏవేవో ఉచిత సలహాలు ప్రభుత్వానికి ఇస్తూ తమ అసమ్మతిని, అయిష్టను వ్యక్తం చేయ సాగారు.
ఇళ్ళలో ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు, అకస్మాత్తుగా వచ్చి, డబాయించి డబ్బులు లాక్కుపోవటం చిన్నతనంలో చూసి చిత్రంగా వుండేది. వీళ్ళని ఎవరూ తమ దరిదాపుల్లోకి రానివ్వరు. పనుల్లోకి పిలవటం తమ పరువుకు నష్టమని భావిస్తారు. వీళ్ళకు కూడా మన అందరిలాగా ఆకలి ఉంటుంది. మనకు లాగా వీళ్శకు ఎన్నో అవసరాలు ఉంటాయి. వీళ్ళుకూడా మానవులే! అనే గుర్తింపు ఇంత వరకు ఎవరకూ కలుగలేదు. వాళ్ళజీవనోపాధి ఏమిటని ఎవరూ ఆలోచించరు. వారి పరిస్తితి తలుచుకుంటే జాలి కలుగుతుంది.
టికెట్ కలెక్టర్ వచ్చాడు. అప్పటి వరకూ తన మేనమామ ఏదో రాజకీయ నాయకుడనీ,
తనకు ొ ఉద్యోగం వెతుక్కునే పనిలేకుండా దొరికిపోతుందనీ గప్పాలు కొట్టాడు ఆ యువకుడు. తన తలిదండ్రులెంత ధనవంతులో, తామందరూ కలిసి ఏ ఏ ప్రదేశాలు చూసామోనని బడాయి కబుర్లు చెప్తున్న ఆ అమ్మాయి కూడా మాటలు ఆపివేసింది. టికెట్ కలెక్టర్ టికెట్ అడగ్గానే ఆ జంట ముఖాలు మాడి పోయాయి. టికెట్ ఎక్కడోపెట్టి మరిచిపోయామన్నట్లు వెతుక్కుని, చివరకు తన జేబులో నుండి బయటకు తీసాడు.
పాసింజర్ కి టికెట్ కొనుక్కుని ఎక్స్ ప్రెస్ రైల్లో ఎక్కి ప్రయాణం చేయటానికి వీల్లేదని వారిని వచ్చే స్టేషన్ లో దిగిపోవలసిందని టికెట్ కలెక్టర్ గట్టిగ హెచ్చరించాడు.
నా టికెట్ చూపించాను.
“ఇదేమిటమ్మా మొదటి తరగతి టికెట్ కొనుక్కుని ఇక్కడ కూర్చున్నారు?” ఆశ్చర్యంగా అడిగాడు. నా కథ నేను వినిపించి, “ఈ మధ్య రైళ్ళలో ప్రయాణం చేసి చాలా రోజులు కావటం వల్ల ఇటీవల జరిగిన మార్పులు తెలియవు,” అని, నా తెలివి తక్కువ తనానికి సిగ్గు పడుతూ చెప్పాను.
నేనామాట చెప్పగానే నా ప్రక్కన కూర్చున్నావిడ గబగబా తన సీట్లో ఒదిగి కూర్చుని, “ఇటు జరగండమ్మా. బాబుని వెనక్కు అనించి కూర్చోబెట్టండి” అని మర్యాద చేసింది. అప్పటి వరకు నన్ను పట్టించుకోని బోగీలో వారందరి చూపులు నా మీద గౌరవంతో నిలిచాయి.
స్టేషన్ లో బోగీల నంబర్ల డిస్ప్లే వుంటుందండి.” సింగిల్ సీట్లో కూర్చున్న వారిలో ఒకతను అన్నాడు.
నేను టికెట్ కలెక్టర్ తో దుర్గారావు సంగతి చెప్పి, అతనికి టికెట్ తీసుకున్నాను.
“ఖమ్మంలో రైలు ఐదు నిముషాలు ఆగుతుంది. మీరు మీ బోగీలోకి వెళ్ళాలనుకుంటే సాయంచేస్తాను” అన్నాడు టికెట్ కలెక్టర్, దుర్గారావు టికెట్ నా చేతికిస్తూ.
వచ్చేపోయే ప్రయాణీకులతోనూ, అమ్మకదారులతోనూ, ఈ బోగీలో ఉన్నంత సందడీ, కాలక్షేపం మొదటి తరగతి బోగీలో వుండదనిపించింది. “ప్రస్తుతం సౌకర్యంగానే కూర్చున్నాం కదా ఇక్కడే వుంటాలెండి” అని ఆయనకు కృతజ్ఞతలు చెప్పాను.
ఇంతలో కంపార్ట్‌మెంట్‌లో పెద్దగా కేక వినిపించింది. ఏం జరిగిందో అనుకుంటూ అందరూ ఆత్రంగా కేక వినిపించిన వైపు వెళ్ళి పోయారు. చుట్టూ ఉన్న జనం మధ్యలోఉన్న చిన్న సందులోనుండి తొంగి చూసాను.
“బిడ్డను పైకి ఎగరేసి పట్టుకోండమ్మా!” ఇజ్రాలలో ఒకావిడి అంటూనే, ఏడుస్తున్న తల్లి చేతుల్లో నుండి, కళ్ళు తేలవేసి, వేళ్ళాడి పోతున్న పిల్లవాడిని తను తీసుకున్నది. పిల్లవాడిని పైకి ఎగరవేస్తూ, ఒడుపుగా పట్టుకుంటూ, కంపార్ట్‌మెంట్‌లో ఆ చివర నుండి ఈ చివర వరకు నడుస్తుంది. రెండు సార్లు అలా తిరుగుతుండగానే, పిల్లవాడు వాంతి చేసుకున్నాడు. కంపార్ట్‌మెంట్‌లో వారంతా అది చూసి, తమ కర్చీఫ్‌లు బయటకు తీసి, ముక్కులు మూసుకున్నారు. రెండవ ఇజ్రా తన చేతిలో ఉన్న పాత గుడ్డతో వాంతి చేసుకున్న చోట తుడిచి శుబ్రం చేసింది. పిల్లవాడు స్పృహలోకి వచ్చి ఏడవ సాగాడు.
పిల్లవాడి తల్లి, కొడుకుని తీసుకుని, నీళ్ళు నిండిన కళ్ళతో ఇజ్రాలకు దణ్ణం పెట్టింది. తండ్రి తన జేబులో నుండి ఐదువందల రూపాయల నోటు తీసి, వారి చేతుల్లో పెడుతూ, “మీకు ఎంత ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము. మా బాబుకి ప్రాణం పోసారు.” చేతులు జోడిస్తూ అన్నాడు.
ఇజ్రాలు ఇద్దరూ మౌనంగా పక్క కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళి పోయారు.
అమ్మమ్మ తాతయ్యలను వదిలి వస్తున్నాననే దిగులుని మరిపించింది జనరల్ బోగీలోని నా ప్రయాణం.
